Saturday, January 8, 2011

What The Dog Saw!

Happy New Year Friends!

I was taking a kind of break from the blogging activity!
I am sure I am back again!

Can you believe Telugu News Papers and Magazines started writing about English books?
The following is one such article written by me recently!

Here you go!
It is about the Book "What The Dog Saw!" by Malcom Gladwell.


What The Dog Saw!
బ్లింక్ అని ఒక పుస్తకం. ఫుట్‌పాత్‌ల మీద కూడా అమ్ముతున్నారు. రచయిత మాల్కం గ్లాడ్‌వెల్. మనుషులు క్షణాల్లో విషయాలను అర్థం చేసుకుని క్షణాల్లో నిర్ణయాలు చేయడం గురించి పరిశోధించి రాసిన రచన యిది. ఇది కథకాదు నవల కాదు వ్యాసాల పరంపర. చదువుతూ ఉంటే ఎంత బాగుందో అంత కష్టంగానూ ఉంది. ఆ ఆలోచనలను అందుకోవడం క్షణంలో మాత్రం వీలు కాదు. కానీ ఆలోచింపజేసే పుస్తకం! అదే రచయిత రాసిన సరికొత్త పుస్తకం ‘వాట్ ద డాగ్ సా’ మరో వ్యాసాల సంకలనం.

రచయిత:
పుస్తకం గురించి తెలుసుకునే ముందు ఈ రచయిత గురించి కొంచెం తెలుసుకోవడం అవసరం. గ్లాడ్‌వెల్ 1963లో లండన్‌లో పుట్టాడు. తండ్రి యూనివర్శిటీలో ప్రొఫెసర్. తల్లి జమైకాలో పుట్టిన స్ర్తి. గ్లాడ్‌వెల్ పుట్టింది ఇంగ్లండ్‌లోనయినా, పెరిగింది మాత్రం కెనాడాలో. టూరం టో యూనివర్శిటీలో చరిత్ర చదువుకున్నాడు. తర్వాత యు. ఎస్.కు చేరి పత్రికా రచయితగా పనిచేశాడు. వాషింగ్టన్ పోస్టుకు సైన్స్, వ్యాపారాలను గురించి రాశాడు. తర్వాత న్యూయార్క్‌లో ఫ్రీలాన్సర్‌గా రాశాడు. చివరకు స్టాఫ్ రైటర్‌గా చేరాడు. గ్లాడ్‌వెల్ మొదటి పుస్తకం ‘టిష్పింగ్ పాయింట్’. కొన్ని ఆలోచనలు అంటువ్యాధులలాగ ఎందుకు వ్యాపిస్తాయి? అన్న విషయం గురించి రాసిన పుస్తకం పాఠకులకు అంటువ్యాధిలా అంటుకున్నది. తర్వాతి పుస్తకం ‘బ్లింక్’. అది కూడా అంతర్జాతీయంగా పేరు పొందింది. మూడవ పుస్తకం ‘ఔట్‌లయర్స్’. మనుషులు సాధించే విజయాల మీద వాతావరణం, సంస్కృతీ చూపించే ప్రభావాల గురించి ఈ పుస్తకంలో చర్చించిన తీరు అద్భుతమన్నారు పాఠకులు.


వరుసబెట్టి బెస్ట్ సెల్లర్స్‌ను అందించిన రచయిత మరో పుస్తకం వెలువరించాడంటే అందరూ ఆసక్తిగా చదవడంలో ఆశ్చర్యం లేదు. మాల్కం గ్లాడ్‌వెల్ ‘ద న్యూయార్కర్’ పత్రికలో రాసిన వ్యాసాల పరంపరలో కొన్ని ఈ పుస్తకంలో ఉన్నాయి. ఈ వ్యాసాలన్నింటిలోనూ ఒక పద్ధతి ఉంది. ప్రతి వ్యాసం ఒక ప్రశ్నతో మొదలవుతుంది. కానీ చూస్తుండగా విషయం మారిపోతుంది.

పుస్తకం:
పుస్తకంలోని వ్యాసాలను మూడు భాగాల కింద చూడవచ్చు. మొదటిది మైనర్ జీవియసెస్! తెలివిగలవాళ్ళే. కానీ గొప్పవారు కాదు. రెండవ భాగంలో ‘సమస్యలకు సమాధానాల’ గురించి వాటిని వెతికిన మనుషుల గురించి వ్యాసాలున్నాయి. అర్థంకాని విషయాలు, రహస్యాలకు మధ్య తేడాను చర్చించే వ్యాసాలు ఈ వరసలో ఉన్నాయి. చివరిభాగం తెలివి. వ్యక్తిత్వాల గురించిన చర్చలతో సాగింది. తెలివి చిన్నతనం నుంచే బయటపడుతుందా, లేక కొంత శ్రమ తర్వాత కనిపిస్తుందా? అన్న అంశాన్ని ఈ భాగంలో విశే్లషిస్తాడు రచయిత. అన్ని వ్యాసాలు, ఒకే రకమయిన ఆసక్తిని రేకెత్తించలేదు. నిజమే గానీ, అంశాలను మారుస్తూ రకరకాలుగా వివరించిన తీరు మాత్రం హాయిగా ఉంటుంది అన్నారు విమర్శకులు.


మూడవ భాగంలోని ఒక వ్యాసంలో ఇద్దరు రచయితల ప్రసక్తి వస్తుంది. వారు బెన్ పౌంటెయిన్, జొనాతన్ సఫ్రాన్ ఫోయర్‌లు వారిద్దరి మధ్యన ఏ రకంగానూ పోలిక లేదు. వీళ్లిద్దరినీ లేట్ బ్లూమర్స్ (ఆలస్యంగా వికసించిన పూలు) అంటాడు గ్లాడ్‌వెల్. హయితీకి 30 సార్లు తిరిగి, నానా కష్టాలు పడి రచయిత అనిపించుకున్నాడు పౌంటెయిన్. ఫోయర్ మాత్రం 19ఏళ్ల వయస్సులో ఒక్కసారి మాత్రం ఉక్రేన్ దేశానికి వెళ్లివచ్చి అద్భుతమయిన పుస్తకం రాసేశాడు. పాల్ సెజాన్, ఎమిలీ జోలాలను కూడా ఈ వర్గంలోనే చేరుస్తాడు గ్లాడ్‌వెల్.


ప్రతి వ్యాసంలోనూ సంభాషణలుంటాయి. అవి పాఠకులను సులభంగా ముందుకు నడిపిస్తాయి. చెప్పదలచిన విషయాలను సూటిగా చెప్పకుండానే పాఠకుడి తలకు ఎక్కించడం ఇక్కడి పద్ధతి. ఒక దానికొకటి వ్యతిరేకంగా ఉండే అంశాలను ఎంచుకుని, చర్చించి, చివరకు వారు అనుకున్న విషయాన్ని ముందుకు తేవడంలో రచయిత, చూపిన ఒడుపు తిరుగులేనిది.


గ్లాడ్‌వెల్ పుస్తకాలన్నింటికీ కవర్‌పేజీలు ఒకేలాగ ‘సింపుల్‌గా’ ఉన్నాయి. రంగులు, హంగులకు దూరంగా, నేరుగా విషయంలోకి దూకడానికి అవి సూచికల్లాగ ఉంటాయి. ప్రస్తుతం వచ్చిన పుస్తకంలో తేడా, ఇవన్నీ పత్రికలో అచ్చయిన వ్యాసాలు. అన్నిట్లోనూ ఒకటే శైలి. విషయంలో తేడా ఉన్నా, నిర్మాణం ఒకే లాగ ఉంటుంది. కుక్క అరుపు గురించి చెప్పినా మనిషి మనసు గురించి చెప్పినా ఒకే తీరు. ఇలా ఇదివరకే ‘బాగున్నాయి’ అనిపించుకున్న వ్యాసాలను ఒకచోట చేర్చడంలో తెలివి ఉందా? ‘హిట్టయిన పాటలన్నీ ఒక సీడీలో తెస్తే తెలివి ఉందా?’ అని జవాబు


వాటర్‌గేట్ పరిశోధన, క్యాన్సర్ పరిశోధన, ఒసామా కోసం వేట లాంటి అంశాలను గురించి ‘ఓపన్ సీక్రెట్స్’ అంటూ చెబితే బాగుంటుంది. ఎంతో బాగుంటుంది. ‘ఓడిపోవడం ఒక కళ’ అని వ్యాసం రాస్తే తప్పకుండా బాగుంటుంది. ఎక్కడా ఒక పక్షంవేపు మొగ్గులేదు. ప్రతి సంగతి గురించీ శాస్ర్తియమయిన చర్చ మాత్రమే ఉంటుంది. రచయితకు, పాఠకుడికి కూడా శ్రమ తెలియదు. హెయిర్‌డైల గురించిన ప్రకటనల్లాంటి అంశాలతో మొదలుపెట్టి, మరో విశాలమయిన విషయాన్ని వివరించగలగడం ఈ రచయితకున్న ప్రతిభ. తాను ప్రవేశపెట్టిన అంశాన్ని చివరకు తానే కాదనడం ఈ రచయిత బలం.


ఇంతకూ ఈ పుస్తకంలో ఎక్కడయిన కుక్క కనిపించిందా? అది ఏం చూడగలిగింది? జవాబు చెబితే బాగుండదు. ఎవరికి వారే తెలుసుకుంటే బాగుంటుంది. ఈ పుస్తకం ఫుట్‌పాత్ మీద దొరికేదాకా ఆగకూడదు. వీలయినంత తొందరగా దీన్ని వెలుగులోకి తేవాలి. పత్రికల్లో వ్యాసాలు రాసేవాళ్ళందరూ ఈ పుస్తకాల్ని ‘స్టడీ’ చేయాలి.



‘వాట్ ద డాగ్ సా’ ముందుమాటలో మాల్కం గ్లాడ్‌వెల్ ‘ముత్యాలు’ కొన్ని....

నాకు తరచూ ఎదురయ్యే ప్రశ్న. నీకీ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయని! దానికి నేనెన్నడూ సరిగా జవాబు చెప్పలేదు. కొందరు నాకు రకరకాల సంగతులు చెప్పడం గురించి, ఎడిటర్ హెన్రీ ఇచ్చిన పుస్తకంలో ఆలోచన వచ్చిందనీ, లేదంటే అసలు నాకే సంగతి గుర్తు లేదని ఏదో చెపుతూ ఉంటాను. ఈ వ్యాసాలను ఒక చోట చేరుస్తూ, ఆ ప్రశ్నకు జవాబు వెదుకు దామనుకున్నాను. ఈ పుస్తకంలో ఒక దీర్ఘమయిన వెర్రి వ్యాసం ఒకటే ఉంది. ‘హైన్జ్ కెచప్‌కు పోటీగా మరో బ్రాండ్ ఎందుకు రాలేదు’ అని. అది సరుకలమ్మే వ్యాపారంలో ఉన్న నా మిత్రుడు డేన్ నుంచి వచ్చిన ఆలోచన. అతను అలాంటి సంగతుల గురించి ఆలోచిస్తుంటాడు. ఆలోచనలను పట్టుకోవాలంటే, ప్రతి ఒక్క వస్తువు, వ్యక్తి నుంచి ఒక కథ రావచ్చని మనల్ని మనం ఒప్పించడం అనే ట్రిక్ వాడాలి. నేను ట్రిక్ అన్నాను. కానీ అది ఒక ఛాలెంజ్ అని నా భావం. ఆ పని చేయడం చాలా కష్టం మరి. మనం స్వాభావికంగా, చాలా విషయాలు అంత ఆసక్తికరమయినవి కావు అనుకుంటాం. టీవీలో ఛానల్స్ మారుస్తూ పదింటిని కాదని, పదకొండోదాన్ని చూడడం మొదలెడతాం. పుస్తకాల స్కోరులో ఇరవై నవలలను తిప్పి చూచి ఒక్కటి కొంటాం. మనం ప్రతిదాన్ని జల్లించి, మార్కులిచ్చి, నిర్ణయాలు చేస్తాం. చేయాలి మరి. ఎన్నో సంగతులున్నాయి. కానీ, రచయిత కావాలంటే మాత్రం ఈ స్వభావంతో ప్రతిరోజూ తలపడవలసి ఉంటుంది.

నేను రచయిత కావాలని ఎప్పుడూ అనుకోలేదు. లాయర్ కావాలనుకున్నాను. కాలేజీ చివరి సంవత్సరంలో అడ్వర్టయిజింగ్‌లోకి వెళ్లాలని నిర్ణయించాను. 18 ఏజెన్సీలకు అప్లై చేశాను. అంతమందీ లేదు పొమ్మన్నారు. ఆ ఉత్తరాలను వరుసగా గోడకు అంటించాను. ఇంకా పై చదువుల గురించి ఆలోచించాను. ఇక్కడ మంచి మార్కులు రాలేదు. మరేదీ దొరకక రాతలో చిక్కాను. రాత కూడా ఒక పనే అని అర్థం చేసుకోవడానికి చాలాకాలం పట్టింది మరి. జాబ్ అంటే సీరియస్‌గా కష్టంగా ఉండాలి మరి. రాతేమో సరదాగా ఉంది! *

Let us enjoy some good reading!!
$$$$$$$

No comments: