Sunday, December 12, 2010

Vikasam December

Here is the link to the Yuva pull out in Andhra Bhoomi!

Yuva in Andhra Bhoomi

Here is the content from the Vikasam page in Yuva published on 1st December.

ఉత్సాహమే ఊఫిరి


- విజయగోపాల్ vijayagopalk@gmail.com

December 1st, 2010

ఏది సాధించాలన్నా ముందు మనసులో ఉత్సాహం ఉండాలి. చదువు, ఉద్యోగం, ఆరోగ్యం, పదిమందిలో గుర్తింపు, ప్రజలతో సంబంధాలు, మనం మరింత బాగుపడటం, ఇలా ఎన్నయినా సరే, అన్నింటికీ ఉత్సాహమే ఊపిరి.

ఏదో కావాలనుకుంటాం. బుద్ధిగానే బయలుదేరతాం. సహజంగానే కష్టాలు ఎదురవుతాయి. ఇదంతా కష్టం అనుకుంటాము. ఇదంతా అసాధ్యం అనే చోటికి చేరుకుంటాం. అప్పుడిక ఆ పని పూర్తి చేయడానికి అవసరమయిన ఉత్సాహం, పట్టుదల సడలిపోతాయి. కష్టమయిన పనులన్నీ అసాధ్యాలు కావు. కష్టమయినా సరే సాధించి తీరాలి అన్న పట్టుదల ఉంటే, పరిస్థితి మరోరకంగా ఉంటుంది. అది లేకుంటే మనుసలో ఒక ఖాళీ, ఒక నిస్సహాయత పరుచుకుంటాయి. అందరమూ ఎప్పుడో ఒకప్పుడు ఈ రకమయిన పరిస్థితిని రుచిచూచిన వాళ్లమే!

అలాంటి సందర్భాల్లోనే ఉత్సాహాన్నీ, పట్టుదలనూ మరోసారి పైకెత్తాల్సి ఉంటుంది. అది అన్నంత, అనుకున్నంత సులభంకాదు. ఎలా, జరగాలది? ఎవరు చేయాలా పని? ప్రశ్నలు ఎదురవుతాయి.

ఇంట్లో వాళ్లు, ట్రెయినర్లు, పుస్తకాలు మనకు ఆ ఉత్సాహాన్ని అందించగలవా? ఎవరో వచ్చి మనకోసం ఏదయినా చేస్తారా?

ఇది జీవితంలో పరీక్ష. అన్ని పరీక్షలలాగే, ఈ పరీక్ష కూడా ఎవరికి వారే ఎదుర్కోవాలి. జయించాలి! మిగతా వాళ్లు ఏదోకొంత సాయం చేస్తారు. పరీక్ష మనవంతుపని! పరీక్ష సమయంలో ‘ఇక నావల్ల అయ్యేట్టు లేదు!’ అంటున్న నీవు ఒక భాగం. ‘లేదు ముందుకు సాగాలి’ అనే నీవు రెండో భాగం. ఈ రెండు నీవుల మధ్య పోరాటంలో రెండో నీవు గెలవాలి. అది ఒకసారి జరిగితేచాలదు. అవసరం వచ్చినప్పుడల్లా ఈ యుద్ధం తప్పదు! ఉత్సాహమే గెలవాలి!

1. జీవితానికి ఒక గమ్యం, ఒక దృష్టి, ఒక వ్యూహం అవసరం! నాకు ఏం కావాలి. పరిస్థితులేమిటి? ఈ పరిస్థితుల్లో నా గమ్యానికి సరైన త్రోవ ఏది అన్న అంశాలు మనసులో ముందే స్థిరంగా ఉండాలి. వాటిని ఒక కాగితం మీద రాసి పెట్టుకోగలిగితే మరీ బాగుంటుంది.

2. ఎంచుకున్న దారిలో ముందుకు కదలడానికి సరైన ఉత్సాహం అవసరం. గమ్యం ఉండగానే సరిపోదు. ముందు ఆ గమ్యం నాకెందుకు? అన్న ప్రశ్నకు జవాబు తెలిసి ఉండాలి. అది నీకు ఇష్టం గనుకనా? అవసరమా? కేవలం మానసిక ప్రశాంతత కొరకా? గమ్యం చేరిన తర్వాత మనకు ఏమి మిగులుతుంది? ఈ ప్రశ్నలకు జవాబులు తెలిస్తే ఉత్సాహం నిలబడుతుంది.

3. మంచి ప్రయత్నాలు కూడా తప్పదన్నట్లు, అదేపనిగా చేస్తుంటే ఉత్సాహం తగ్గుతుంది. అప్పుడప్పుడు నిలబడి విశ్రాంతిగా ఆలోచించడం మంచిది. అప్పుడు ఉత్సాహం మరింత పెరుగుతుంది.

4. ఫలితాలు అందుతుంటే ఉత్సాహం పెరుగుతుంది. చాలా సందర్భాల్లో ఫలితం కోసం చేసే ప్రయత్నాలే ఎంతో ఉత్సాహకరంగా ఉంటాయి. ‘ప్రయాణమే నా గమ్యం’ అని ఒక చక్కని మాట ఉంది.

5. ప్రయత్నించాలని నిశ్చయించడం మనకు అందే తొలి ఫలితం! ఉత్సాహం లేనిదే జీవితం లేదు. జీవితమంటేనే ఉత్సాహం! ఆ ఉత్సాహమే జీవితానికి ఊపిరి.

=========================

రాక్షస బలం

భలే! భలే బాగుంటుంది! రాక్షసుడికున్నంత బలం ఉంటే భలే బాగుంటుంది. కానీ దాన్ని రాక్షసుడిలాగే వాడితే మాత్రం బాగుండదు.


- షేక్స్‌పియర్


- అవును! నేను నాపట్ల నేనుగాని, ఇతరుల పట్ల గానీ రాక్షసంగా ఉండను. నాలోని వెలుగే నా బలం. నాగురించి నేను తెలుసుకోవడమే నా ప్రయత్నం.


పని: పని ఎక్కువయిందని బాధపడి లాభం లేదు. పరిస్థితి మరీ దుర్భరమయితే ఆ విషయాన్నీ, పనినీ అర్థం చేసుకునే వారి కోసం వెదకాలి.

=======================

భలేవాదూ.. బాసూ..

అధికారం కలవారికి, దాన్ని అతిగా వాడటం అలవాటవుతుంది. అలాంటి వారి తీరు మిగతా వారందరినీ మానసికంగా, శారీరకంగా కుంగదీస్తుంది. మీరు బాగా పని చేస్తారు. అయినా అనవసరంగా చివాట్లు తింటున్నారు. అవమానాలూ జరుగుతున్నాయి. అక్కడ తప్పు మీది కాదు. ‘బాసు’లది!


బాసు తీరు ఒకే లాగుండదు:


వారు ఎప్పుడు ఏ మూడ్‌లో ఉంటారో తెలీదు. ఏంచెబితే ఏమంటారో? దేన్ని మెచ్చుకుంటారో? దేనికి అరుస్తారో తెలియదు. నూరు సంగతులు ఆలోచించుకుని వెళితే 101వ ప్రశ్న అడిగే బాసులుంటారు.


అవమాన పరచడం హాబీ:


అందరినీ తప్పులు పట్టడం, అందరిలోనూ అవమానపర్చడం, అదొక రాక్షస ప్రవృత్తి. మంచిపని అని తెలిసి కూడా మెచ్చుకోక పోవడం ఒక రుగ్మత. పైగా ఆ ‘మంచి’ అంతా తమవల్లనే జరిగిందని ప్రచారం చేసుకునే బాసులూ ఉన్నారు.


వాళ్ళు గెలవాలి, మిగతావాళ్ళు ఓడాలి:


అందరూ గెలిస్తే కొందరు అధికారులకు నచ్చదు. ఎదుటివారు చెబుతున్నదే నిజమనే పరిస్థితి వస్తే దాటవేసే ప్రయత్నాలు చేస్తారు కూడా.


ఎవరికీ స్ఫూర్తినిచ్చే ప్రసక్తి లేదు:


‘ఏం చేస్తారో తెలియదు. ఈ పని అయిపోవాలి!’ అనేది వారి నుంచి వచ్చే మామూలు మాట! వాళ్ళకే తెలియకపోతే, వారి నుంచి నేర్చుకోవలసిన మనకు తెలిసేది ఎట్లా?


ఆఫీసులో అధికారి పద్ధతి ఇదయితే మనం మన పిల్లలతో, తోటివారితో, బంధువులతో ఇదేరకంగా ఉంటున్నామా? అని ఆలోచించవలసిన అవసరం ఉంది. మనదీ ఇదే పద్ధతి గనుక అయితే, చివరకు మిత్రులు కూడా మిగలరు మరి! అధికారులు మారాలి. మరి మనమూ మారాలా? ఆలోచించాలి గదూ?

=======================

మనలోనే ఉంది

ఒకప్పుడు ప్రపంచంలోని తెలివంతా అందరికీ అందుబాటులో ఉండేదట. అయినా ఎవరూ దాన్ని అంతగా పట్టించుకోలేదు. దేవతలకు ఈ పరిస్థితి నచ్చలేదు. తెలివి నిజంగా కష్టపడి ప్రయత్నించే వారికి మాత్రమే అందుబాటులో ఉండాలని నిర్ణయించారు. అప్పుడయినా తెలివిని బాగా వాడుకుంటారని వారి అభిప్రాయం.


మరి తెలివినంతా ఎక్కడ దాచాలి?


‘నేలలో లోతుగా పాతితే సరి’ అన్నారొకరు.


‘లేదు. మనుషులు తవ్వి తెలుసుకుంటార’ని జవాబు వచ్చింది.


‘సముద్రం లోతుల్లో దాచవచ్చు’


‘లేదు అక్కడికీ చేరగలడు మనిషి’


ఎత్తయిన కొండకొమ్మున పెడితే?’


‘అదీ అందని చోటేమీ కాదు!’


‘ఇదంతా కాదు. మనిషిలోనే ఆ తెలివిని దాచితే సరి. తనలో వెదకాలని మనిషికి తోచదు!’ అన్నాడు నిజంగా తెలివిగల దేవుడొకాయన.


అలాగే జరిగింది! ఇవాళ్టికీ అలాగే ఉంది!

=================

ఆలోచించండి

‘మనల్ని మనం మన భావాల ఆధారంగా బేరీజు వేసుకుంటాం. ఎదుటివారిని మాత్రం వారి పనులు, మాటల ఆధారంగా బేరీజు వేస్తాం!’


ఎవరో మన పొరపాటును ఎత్తి చూపుతారు. ‘నిజానికి నేను అలా చేయాలని అనుకోలేదు! ఏదో జరిగిపోయింది!’ అంటాం. అందరూ అంతేనేమో?


Let us enjoy readimg some fine ideas!
()()()()()()()()()

No comments: