Sunday, December 5, 2010

Vikasam again

The Yuva suppliment of Andhra Bhoomi carries a page contributed by me.

http://www.andhrabhoomi.net/features/yuva

Here is the material from the third edition!

Vikasam!

వికాసం

నిర్వహణ : విజయగోపాల్ vijayagopalk@gmail.com

మీరు ఎటు వైపు?

November 23rd, 2010


చాలాసార్లు మనం కొన్ని విషయాలను గురించి ‘ఇది ఇలా ఉంటే ఎంత బాగుంటుంది’ అనుకుంటాము. కొందరు మాత్రం ‘అలా’ ఉంటే ఉండే పరిస్థితిని కలలుగంటూ ఊహాగానాలు, పథకాలు మొదలు పెడతారు. అలాంటి వారిని భావిజీవులు అనవచ్చు. మరోకోవకు చెందిన వారయితే భవిష్యత్తు మీకొక స్ఫూర్తినిస్తుంది. భవిష్యత్తులోని అంశాలను ‘సినిమా’లాగా మీరు మనోఫలకం మీద చూడగలుగుతారు. ఆ రేపటి రూపం మిమ్మల్ని బలంగా ముందుకు కదిలేలా చేస్తుంది. కనిపించే చిత్రంలో, అంటే మీ భవిష్యత్తులో ఏముంటుంది? అన్న వివరాలు మీ శక్తి యువక్తుల మీద ఆధారపడతాయి. ఊరికే కలలుగంటే కుదరదు. మీకున్న బలమేమిటి? ఆసక్తి ఎంత? అనే ప్రశ్నలను ముందుగా గుర్తుంచుకోవాలి. ఆలోచన ఆచరణగా మారాలి. అప్పుడే అనుకున్న మంచి ప్రపంచం, మంచి జీవితం, మంచి మనుషులు, మంచి హంగులు సమకూరే వీలు ఉంటుంది. భావి జీవిని ఈ హంగులన్నీ ముందుకు కదిలిస్తాయి. కనుకనే అవన్నీ సమకూరుతాయి. కూడా!


రానున్న కాలం గురించిన కలలకన్నా, కావలసిన పరిస్థితుల గురించి వివరాలతో సహా ఒక దృష్టి ఉండడం అవసరం. అప్పుడు ప్రస్తుత పరిస్థితులు ఏ మాత్రం బాగులేక పోయినా సరే ఫరవాలేదు. తోడుగా ఉండవలసిన వాళ్ళు ఎంత నిరాశపరులు ‘ఆఁ! ఏముందిలే!’ అనే వాళ్ళూ అయినా ఫరవాలేదు. మీరు మాత్రం మీ భవిష్యత్తు గురించిన వివరాలను చూడగలుగుతారు. ఆ వివరాలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. మీ ఉత్సాహం, పట్టుదల మరింత మందికి ఉత్సాహాన్ని, పట్టుదలనూ పంచగలుగుతుంది.


అంటువ్యాధులకన్నా సులభంగా ఇతరులకు సోకే శక్తి ఉత్సాహానికి ఉంది: మిగతా వాళ్ళంతా మీరు కలగన్న వివరాలను వినాలని ముందుకు వస్తారు. అందరికీ ఆలోచనలు రావు! ‘హద్దులను మరింత ముందుకు నెట్టడం అందరికీ చేతగాదు. మీ ఆశలతో ఒక చిక్కుంది. మీరు వాటిని సులభంగా సాధించగలరు. ఆ తర్వాత మరేమీ లేదనుకుంటారు! అదే చిక్కు!’ అంటారొక పెద్ద మనిషి.


భవిష్యత్తు గురించిన మీ చిత్రాన్ని మరింత మందికి మీరు చూపించగలిగాలి. ఆ వివరాలను వర్ణించి చెప్పే శక్తి మీలో ఉండాలి. మీ నమ్మకం, ఉత్సాహం మరింత మందికి అంటుతుంది.


‘ఆపని వీలు కాదంటే నేను నమ్మలేను. అయితే ఆ పని ఇదివరకు ఎవరూ చేసి ఉండకపోవచ్చు. మనం ప్రయత్నించి చూస్తే పోతుంది’ అనగలిగి ఉండాలి.


ఒక పనిని గురించి అదికష్టం, కనుక అసాధ్యం అనడం ఒక పద్ధతి. అదే పని గురించి ‘అది కష్టం కావచ్చు. కానీ అసాధ్యమని ఇప్పుడే అనడంలో అర్థం లేదు!’ అనడం భావిజీవి పద్ధతి! అటో, ఇటో తేల్చుకోవాలి. ఒకేచోట ఉండిపోకూడదు. ఏదో ఒక వేపు కదలాలి! ఎటు కదలుతారు? భావిజీవితం వైపే కదూ...

====================

అదీ కళే!

ఎపిక్టెస్ మొదటి శతాబ్దిలో రోమ్ నగరంలో ‘వెట్టి’ పని చేశాడు. తరువాత విముక్తి పొందాడు. తన చుట్టు చేరిన వారికి తత్వం గురించి బోధించేవాడు.

ఒకతను ఆయ దగ్గరకు వచ్చి ‘అయ్యా! మీ మాటలను వినాలని ఎన్నోసార్లు వచ్చాను. ఫలితం అందలేదు. దయచేసి ఏమయినా చెప్పండి’ అని అడిగాడు.

‘మాట్లాడడమంటే, అన్ని పనులలాగే అంత సులభం అనుకున్నావా? ఆ మాటలు సరిగా ఉండాలి. ఎదుటివారికి పనికిరావాలి కదా!’ అన్నాడు ఎపిక్టెటస్.

‘అవున’న్నాడు ఆగంతకుడు.

‘అందరూ విన్న విషయాలతో లాభం పొందుతారా? లేక కొందరేనా? మాట్లాడడం ఎంతటి కళనో, వినడమూ అంతే కళగా తోస్తుంది నాకు. ఒక విగ్రహానికి రూపు పోయాలంటే నైపుణ్యం ఉండాలి. ఆ విగ్రహాన్ని సరిగా చూచి ఆనందించడానికీ నైపుణ్యం ఉండాలి మరి!’ అన్నాడు ఎపిక్టెటస్ జవాబుగా!

-గోల్డెన్ సేయింగ్స్ ఆఫ్ ఎపిక్టిటస్ నుంచి

======================

భయం...

‘పడిపోతామని, విఫలులవుతామని, దొరికిపోతామని


భయపడుతూ బతుకుతుంటే


ఆ బతుకు మోయలేని బరువవుతుంది’

==============================

అందరూ గెలవాలి

అమెరికాలోని మరీన్ కౌంటీ, శాన్ ఫ్రాన్సిస్కో నగరాల మధ్యన, ‘గోల్డెన్ గేట్’ అనే వంతెన నిర్మించారు. వంతెన నిర్మాణం ముగిస్తే ప్రయాణాలు సులభంగా జరుగుతాయని రెండు వేపులవారూ ఎదురు చూశారు. మరో రెండు వర్గాలు కూడా వంతెన నిర్మాణంలో ఆసక్తి కనబరిచారు. వంతెన నిర్మాణంలో పనిచేస్తున్నవారు ఒక వర్గమయితే, వారిలో ఎవరయినా ప్రమాదానికి గురయి చనిపోతే, ఆ చోట తమకు పని దొరుకుతుందని వేచి చూసిన వారు మరో వర్గం! ఈ రెండవ వర్గంవారి ఎదురు చూపులు సులభంగానే ఫలించినట్లున్నాయి. గోల్డెన్ గేట్ వంతెన మొదటి దఫా నిర్మాణంలో భద్రత ఏర్పాట్లు ఏవీ చేసినట్లు కనబడదు. కనుక ఇరవై ముగ్గురు పనివారు ప్రమాదవశాత్తు పడిపోయి మరణించారు. చివరకు తేరుకున్న అధికారులు లక్ష డాలర్ల ఖర్చుతో వంతెన కింద ఒక పెద్ద వలను ఏర్పాటు చేశారు. ఆ వల కారణంగా కనీసం పదిమంది ప్రాణాలు నిలిచాయి. 24 శాతం పని ఎక్కువ జరిగినట్లు కూడా లెక్క తేలింది. అది వల ఖరీదుకన్నా ఎన్నో రెట్లని కూడా లెక్కవేశారు. ఎవరో చనిపోవాలని చూసిన వారికి తప్ప, అందరికీ సంతృప్తి కలిగింది. అనుకున్నదానికన్నా తక్కువ ఖర్చుతో వంతెన తయారైంది. పనివాళ్లూ బాగా పనిచేసి జీవనం సాగించగలిగారు!

==============================

నిర్మొహమాటంగా..

మంచివారు అనిపించుకోవాలంటే, ఎవరు ఏం చెప్పినా ‘అవును’ అనాలని కొందరు అనుకుంటారు. కాదు, లేదు అని జవాబు చెప్పవలసిన ప్రశ్నలకు ఆ రకంగా చెప్పడం మొరటుతనమని కూడా చాలామందికి అభిప్రాయం ఉంటుంది.

ఇంట్లో, సమాజంలో, పనిచేసే చోటా, మనకు అనుకూలం కాని పరిస్థితులు చాలా ఎదురవుతాయి. మొహమాటం కొద్దీ అన్నింటికీ అవునంటుంటే మనమీద ఒత్తిడి ఎక్కువవుతుంది!

‘అవును, కాదు’ అంటూ మన స్వంత భావాలను చెప్పగల స్వతంత్రం మనకుంది. అప్పుడే మన హక్కులు మనకు మిగులుతాయి. మన భావాలు పదిమందికీ తెలుస్తాయి. మన అవసరాలు మనకు అందే వీలు కలుగుతుంది. మన దృక్పథం అందరికీ అర్ధమవుతుంది. మన సినిమా కథల తీరు ఒక్కసారి మనసులో విశే్లషించి చూడండి. నిత్య జీవితంలో మనం గురవుతున్న ఒత్తిడికి కారణాలను వెదికి చూడండి. చెప్పవలసిన ‘ఒక్క’ విషయాన్ని చెప్పకపోవడంవల్ల అంత కథ నడుస్తుంది. ఇంత అసౌకర్యం కలుగుతుంది. కాబట్టి, చెప్పవలసిన విషయాన్ని వినయంగానే చెప్పగలగాలి. మీకు ఇప్పటికే ఆఫీసులో పని ఎక్కువయింది. బాగా పనిచేసే వారికే మరింత పని చెపుతారన్నది అందరికీ తెలిసిన సంగతే. మీకూ అదే జరిగింది. మరింత పని తలమీద వేశారు. మంచితనం పేరిట, ఆ భారాన్ని కూడా తలకెత్తుకుని సతమతమవుతారా? అలా చేస్తే ఏ పనినీ సక్రమంగా చేయలేకపోతారేమో?

మీకు తీపి తినడం ఇష్టంలేదు. వాళ్లేమో అదేపనిగా తీపి వడ్డిస్తున్నారు. ఈ రెండు సందర్భాల్లోనూ మీరు మీ మనసును గౌరవంగా బయటపెట్టగలగాలి. అందులో ఏరకమయిన అపరాధ భావన అవసరంలేదు. అవతలివాళ్లు ఏమనుకుంటారోనన్న అనుమానం అవసరంలేదు! ఏమో? అర్ధం చేసుకుంటారేమో? ఆ అవకాశం కూడా ఉందిగదా?

మీ నిర్ణయాలు మీరు నిర్మొహమాటంగా చేయండి.
మీ దగ్గర పనిచేసే వారికీ, పిల్లలకూ నిజం చెప్పడం అవసరం.
మీపై అధికారులకు పెద్దలకూ మీ మనసు విప్పి చెప్పండి.
మీతోపాటు పనిచేసే వారికీ మీ మనసు తెలిస్తే మంచిది.
మీ సాయం కోరి వచ్చేవారితో మొహమాటం పెట్టుకోవద్దు!

మిత్రులు, కుటుంబంలోని వారితో కూడా అసలయిన భావాలను తేల్చి చెప్పగలగాలి! మనుషులందరిలోను మంచి ఉంది. ఆ మంచి పెంచే అవకాశాలను మనం చేజేతులా వదులు కోకూడదు. **

Let us enjoy some good thoughts!
$$$$$$

No comments: